Thursday, September 28, 2006

అయ్యో గుడ్డు గుర్నాధం.


ప్రదర్శన : కొలరాడో తెలుగు సంఘం వారి ఉగాది(2006) ఉత్సవాల్లో(www.coloradotelugu.org)
రచన-దర్శకత్వం : భూపతి విహారి దోనిపర్తి


పాత్రలు:

గుడ్డు గుర్నాధం : పిసినారి. డబ్బు కోసం ఏ పనికైనా సిద్దపడే వ్యక్తి. (యుగంధర్ బోర )
సై బర్ బాబు : వెబ్ ప్రపంచమే తన ప్రపంచం అనుకొనే వెబ్ వీరుడు.స్యయానా మేనల్లుడు.(భూపతి విహారి దోనిపర్తి)
ఆనంద్ : కవి. ఎప్పుడూ కవితలూ కథలంటూ బలాదూర్ గా తిరుగుతుంటాడు.(రామారావ్ కలగర)
యాదగిరి : గుర్నాధం ఇంట్లో పని చేసే వ్యక్తి.(రాంబాబు సొంటి)

Scene1

(యాదగిరి ఇల్లు తుడుస్తూ సర్దుతూ వుంటాడు.)

యాదగిరి : ఇయ్యాల రేపు ఈ డబ్బున్నోళ్ళకు ఏది ఎక్కడ పెట్టాలో తెల్వట్లే. హాల్లో వుండాల్సింది బెడ్ రూంలో వుంటాది బెడ్రూంలో వుండాల్సింది హాల్లో వుంటాది.

ఆనంద్ : యాదగిరి...నేను కవి సమ్మేళనానికి వెళ్తున్నాను..నాన్నతో చెప్పు.

యాదగిరి : ఆనంద్ సాబ్..ఇంత జల్ది యాడికి పోతున్నారు. కొంచెం టిఫిన్ చేసి పోరాదే?

ఆనంద్ :(కవిత్వమందు కుంటాడు)యాదగిరి...నువ్వు టిఫిన్ పేరు చెప్పగానే నాకు టిఫిన్ మీద ఆశువుగా కవిత్వం తన్నుకొస్తోంది.


నాకెందుకీ టిఫిను.
నాకొద్దీ టిఫిను.
నువ్వు చేసిన టిఫిను.
నేను తిననీ టిఫిను.
చేత్తో తిననీ టిఫిను.
స్పూన్ తో తిననీ టిఫిను.
అదిరింది కదా ఈ కవిత.


యాదగిరి :(కన్ ఫ్యూజ్ అయి పోయి)ఆయ్..సక్కత్ గుంది.


ఆనంద్ :(కొంచెం కోపంగా)మరయితే ఆగిపోయావేం...కొట్టు చప్పట్లు.(యాదగిరి, ఆనంద్ ఇద్దరూ చప్పట్లు కొడతారు...ఆనంద్ ప్రేక్షకుల వైపు తిరిగి). మీరాగి పోయారే కొట్టండి చప్పట్లు. కొట్టక పోతే ఇంకొటి వినిపిస్తా.


యాదగిర్ : కాస్త పాలన్న తీసుకొండ్రి?


ఆనంద్ : యాదగిరీ..నువ్వు పాల పేరు చెప్పి నా కవితా హృదయాన్ని కవ్వం వేసి చిలుకుతున్నావయ్యా. వెన్న బయటకి
వచ్చేసింది. వెంటనే కక్కేస్తా.


తాగాను నేను చిన్నప్పుడు అమ్మ పాలు.
తాగాను నేను చిన్నప్పుడు గేదె పాలు.
తాగాను నేను చిన్నప్పుడు ఆవు పాలు.
దొరక లేదు తరువాత నాకు మేక పాలు.
చివరికి నేను తాగాను డబ్బా పాలు.
ఇప్పుడు నాకొద్దీ గ్లాసెడు పాలు.


(తన్మయత్వం తో మూసిన కళ్ళు తెరుస్తాడు....కోంచెం కోపంగా..) ఏంటి అలా చూస్తావ్ యాదగిరి..ఓ కవి కి
ఇవ్వాల్సిన గౌరవమిదేనా?


యాదగిరి : ఏంటి సాబ్ కవులు పాలు తాగరా?


ఆనంద్ :(గట్టిగా) ఛా! ఇప్పుడు పాల గురించి ఎవరడిగారయ్యా....(మెత్తగా...) చప్పట్లు...చప్పట్లు. కవి
కావాల్సినవి అవే.


యాదగిరి : ఒహో అవా...(గట్టిగా చప్పట్లు కొడతాడు)


ఆనంద్ :(ప్రేక్షకుల వైపు తిరిగి)ఏమిటి మీకు మళ్ళీ చెప్పాలా?...చప్పట్లు.


యాదగిరి : కనీసం ఆపిల్ జ్యూస్ అయినా తాగి పోరాదే?


ఆనంద్ :(చిన్న గా low voice తో): యాదగిరీ..నువ్వు నాలో వున్న కవి ని అసలు నిద్ర పోనీకుండ గునపం తో గుచ్చి
లేపుతున్నావ్. ఇక నావల్ల కాదు.... కవి మనసు అల్ల కల్లోలమయింది సునామీ వచ్చేసింది.


యాదగిర్ : మాఫ్ కీజియే బాబూ. మీరు బయటికి దయ చేయండ్రి. కావాలంటే నేను చప్పట్లు కూడా కొట్టేస్తా.


ఆనంద్ : ఒక కవి మనసును ఎంత చీప్ గా అర్థం చేసుకున్నావయ్యా. కవిత్వం చెప్పకుండా చప్పట్లు కొట్టడమంటే పెళ్ళవకుండా పిల్లలు పుట్టినట్టు, వీసా లేకుండా అమెరికా వెళ్ళినట్టు...అది ఇల్లీగల్. కవిత చెప్పిన తరువాత నీ చేతుల్లో పుళ్ళు పుట్టేంతగ చప్పట్లు కొట్టు నాకేమీ అభ్యంతరం లేదు. ఇప్పుడు పళ్ళ మీద ఓ కవిత ఒదులుతా కాచుకో.


గుండ్రంగా వుండేది ఆపిల్ పండు
మెత్తగా వుండేది బత్తాయి పండు
పసుపుగా వుండేది పనస పండు.
పొడవుగా వుండేది అరటి పండు.
పొట్టిగా వుండేది ద్రాక్ష పండు.
గట్టిగా వుండేది జామ పండు
అయినా నాకిష్టమైన పండు చింత పండు.


(యాదగిరిగట్టిగా చప్పట్లు కొడతాడు).

అదీ అలా వుండాలి కళాభిమానులంటే. ఇక నే వెళ్ళొస్తా...జ్యుసలకు..పాలకు డబ్బులు తగలేస్తున్నావని నాన్నకు తెలియనివ్వకు. తెలిస్తే నీ పుచ్చ లేచి పోతుంది. (ఆనంద్ బయటికి వెళ్ళి పోతాడు)

యాదగిరి (గట్టిగా ఊపిరి పీల్చు కుని): హమ్మయ్యా బచ్ గయా...పొద్దున్నే ఈ రబ్బర్ హ్యమరింగేందో.

(సై బాబు enter అవుతాడు...Western music కి dance వేసుకుంటూ చేతిలో laptop పట్టుకుని chating చేసుకుంటూ వస్తాడు.)

సై.బా. : హె యాద్స్. whaats up babee... chicken fry, mutton fry and fish curry ready చేశావా?

యాదగిరి : లేదు సాబ్. fish కు mutton కు పైసలెక్కువవుతాయని తేవద్దని చెప్పిండు గుర్నాధం సాబ్. ఈ bird flu దెబ్బ కు కోడి మాంసం కూరగాయల్కన్నా చీపని అన్ని వంటలు దాంతోనే చెయ్యమన్నాడు.

సై.బా : హె.. శుభం పలకరా computer అంటే Do you want to perform virus scan? అందట. fish ఉందా అంటే పిసిని గొట్టు గుడ్డు గుర్నాధం పేరు చెప్తావే. that old stinky fellow వాడు ఎంజాయ్ చెయ్యడు...మనల్ని ఎంజాయ్ చెయ్యనీడు. పోతే పోనీలే కొడిని వెలాడదీసుకుని తినమనలేదు. ఆ stinky fellow ని గూగుల్ లో కూడా లేకుండా చెయ్యాలి.

యాదగిరి : హె సైబర్ నీకంత ఖలేజా లేదు కానీ ఇంకోటి చెప్పండ్రి.

సై.బా .: అలాగయితే నా మంస్ పేరు మీద పీనాసిగుర్నాధం డాట్ కాం అని వెబ్ సైటు open చేసి అందరికి SMS పంపిచేస్తా.

గుర్నాధం (వేరే గది లొంచీ అరుస్తాడు): ఒరేయ్ యాదగిరి ఎక్కడ చచ్చావ్ రా. కాFఈ తెమ్మంటే ఇంకా హాల్లో నే తగలడ్డావా?

యాదగిరి (విసుక్కొని): గీ పెద్దాయనకి దిమాఖ్ ఖరాభయిందనుకుంటా. ఎక్కడ ఏదుందో కనిపించట్లే.(గట్టిగా అరచి).సాబ్..గా కాFఈ అక్కడే మీ రూంలో టీవీ పక్కనే పెట్టినా.

గుర్నాధం : ఆ విషయం ముందే చెప్పి ఏడవచ్చు కదా?

సై.బా. : హె యాద్స్ ఈ old processer కొంచెం upgrade అయినట్టుందే? రోజూ కాఫీ తాగితే కాఫీ కి డబ్బులయిపోతాయనేవాడు. ఇప్పుడు కాఫీ కూడ తాగుతున్నాడా?

యాదగిరి : గదేం లే. కాఫీ తాగితే గుండె జబ్బు తగ్గుతుందని మొన్నెప్పుడో పేపర్ లో చదివిండు.ఇగో గప్పట్నుండి తాగ బట్టిండు. గది కూడా పొద్దున రెండు చుక్కల్ సాయంత్రం రెండు చుక్కల్.

సై.బా : ఓ ఈ Old computer కి system crash అవుతుందని భయం పట్టుకుందన్న మాట.

యాదగిరి : (తన నడుము పట్టుకుని dance చేస్తాడు). గేంది సైబర్ బాబూ..నీ dance చూసి నా నడుము కూడా dance చేస్తొందే.

సై.బా : మిస్టర్ యాద్స్. నీ నడుముకున్న Towel తీసి cell phone తియ్యారాదే. నేను నా window close కుని పోతా. (dance చేసుకుంటూ లోపలికి వెళ్ళిపోతాడు)

యాదగిరి (వెంటనే ఏదో గుర్తొచ్చినట్టు నడుము కున్న తువ్వాలు విప్ప దీసి అందులోని cell phone తీసి మాట్లాడతాడు) అలో సుబ్బీ నువ్వటే ఏందే గీ time లో phone చేసినవ్? ఏటి సాయంత్రం నిను సిన్మా కు తీసుకెళ్ళాలా? అట్టాగే నేను ఇక్కడ్నుంచి జల్దీ వచ్చేస్తా.నువ్వు అక్కడ phone నొక్కేసేయ్. నేనిక్కడ నొక్కేస్తా.

గుర్నాధం :(కాఫీ తాగుతూ పేపర్ చదువుకొంటూ వచ్చి హాల్లో కూర్చుంటాడు). ఏరా యాద్గిరీ మన బడుద్దాయిలు ఇంక నిద్ర లేచారా లేదా?

యాదగిరి : మన అబ్బాయేమో అప్పుడే లేచి రడీ అయిపొయి ఏదో మీటింగుకు బయటికెళ్ళిండు. అల్లుడేమో నిన్న పోయి గిప్పుడే వచ్చిండు. యాడికెళ్ళుండో చెప్పలే.

గుర్నాధం : వాడెక్కడి కెళ్ళుంటాడు. వాడి పేరే cyber babu. ఎక్కడో కొత్త internet cafe పెట్టుంటారు అక్కడి కెళ్ళి అందరికి చాటింగెలా చెయ్యాలో నేర్పిస్తా వుంటాడు.రానీ వాడి సంగతి చెప్తా( అంతలో నే ఒక rap song వినిపిస్తుంది)
(head phone పెట్టుకుని, ఒక చేతిలో laptop పట్టుకుని ఇంకో చేత్తో type చేస్తూ cyber babu enter అవుతాడు.)

సైబర్ బాబు (dance చేస్తూ): హాయ్ మాంస్ ...వాట్ ఏమిటి అప్పుడే నిద్ర లేచేశారా? You old fashioned dude.

గుర్నాధం (కోపంగా): అడ్డ గాడిదా. చెల్లెలు కొడుకు కదా అని చేర దీస్తే. నేను సంపాదించిందంతా నువ్వు ఈ పనికిమాలిన వాటిని కొండానికి తగలేస్తావా?

సైబర్ బాబు : నో మా మస్. these are not పనికి మాలినవి they are all Hi-tech stuff. With this stuff you can chat with any gal in the world.

గుర్నాధం : అప్రాచ్యుడా! నేను ఒంటి మీద చొక్కా వేసుకోకుండా కూడా పైస..పైసా కూడ బెట్టి సంపాదిస్తుంటే నువ్వు ఇలా అడ్డ మైన వాటికి ఖర్చు పెట్టడానికి మనసెలా ఒప్పిందిరా?

సై బర్ బాబు : My dear మేనUncle ఖర్చు పెట్టడానికి వుండాల్సింది మనసు కాదు. జేబులో డబ్బు. అయినా ఈ ఆస్తి లో నా డబ్బు కూడ ఉంది. మా అమ్మా నాన్నా పోయాక మా ఆస్తి కూడ ఇందులో కలిపేసుకుని external hard drive లాగ వాడుకుంటున్నావ్ కదా?

(గుర్నాధానికి కోపం వచ్చి సై.బా. కొట్టడానికి లేస్తాడు.)

యాదగిరి (సైబర్ బాబు వైపు తిరిగి): మీరు జర ఊర్కోండి బాబు గారు. రేపో మాపో గుండె పోటొచ్చి బడే సాబ్ పోతే ఇందులో మీకూ షేర్ ఒస్తుంది కదా.

సై బర్ బాబు ( మెల్లగా):ఓ you are right baybee... నేను disconnect అవుతా. (అని లోపలికెళ్ళిపోతాడు)

గుర్నాధం : ఏంట్రా! యాదగిరి నువ్వేదో పేల్తున్నావ్.

యాదగిరి :గబ్బే ఏం లే సాబ్. మీరు దిమాఖ్ ఖరాబవ కుండా సాంతంగా కూకోండి.ఈ కాలం పోరగాళ్ళంతే.గిట్ట చాటింగులూ గీటింగులు అంటూ మీటింగులు పెట్టి పోరిలను పటాయించాలుంకుంటారు. ఏదో ఒక రోజు ఒక పోరి హ్యండిస్తుంది. దాంతో దిల్ గార్డెన్ గార్డెన్ అయిపోయి మీ రాస్తా లోకొస్తారు.మీరేమీ ఫిఖర్ అవకండి.

గుర్నాధం : అంతే నంటావా. అవునంతేలే నేను వయసు లో వున్నప్పుడు నాకు మాణిక్యం హండివ్వ బట్టే ఇంత ఆస్తున్న అలివేలు బార్య గా దొరికింది.

యాదగిరి : అందుకే గా బొగ్గు గనికి చీర చుట్టినట్టుండే ఆవిడను చేసుకున్నవ్.

గుర్నాధం :ఏంట్రా ఏదో బొగ్గంటున్నావ్.

యాదగిరి (సర్దుకొంటూ): గబ్బే లేదయ్యా. గట్ల బుగ్గల్ సొట్టల్ పడుతూ ఆ అమ్మ గారు గొప్పగుంటారంటున్నా.
(అంతలో ఫోన్ మోగుతుంది. యాదగిరి ఫోన్ తీసుకుంటాడు)

యాదగిరి : అలో ఎవడుభే ఈ టైంలో ఫోన్ చేసింది.

గుర్నాధం పెద్ద కొడుకు(అమెరికా నించి): ఒరేయ్ యాదగిరి నీకు వళ్ళు బాగ బలిసింది.నోర్మూసుకుని ఆ ఫోన్ నాన్న
గారికి ఇవ్వు.

యాదగిరి :అరె! మీరా పెద్దబ్బాయ్ గారా? మాఫ్కీజియే. ఇగో అయ్యగారికి ఇస్తున్నా.

గుర్నాధం : హలో! ఏరా ఎలా వున్నావ్? కోడలు మనవడు బాగానే వున్నారా?

పె.కొ : బాగానే వున్నారు నాన్నా? మీరెలా వున్నారు? అమ్మ, చెల్లి బావున్నారా? తమ్ముడూ బావా ఎలా వున్నారు?

గుర్నాధం : అంతా బాగానే వున్నారు. మీ అమ్మ,చెల్లి మీ అమ్మమ్మ వాళ్ళూరికి పోయారు. ఇక నీ తమ్ముడంటావా వాడు సంపాందన గింపాదన ఏమి లేకుండా జులాయి గా ఏవేవో కవిత్వాలంటూ తిరుగుతున్నాడు. మీ భావ సంగతి సరే సరి. వాడు ఎప్పుడూ అదేందది...కంపుటర్ దాన్ని మెళ్ళో వెసుకుని తిరుగుతుంటాడు.

పె.కొ : అయితె ఎవరూ మారలేదన్న మాట. ఆ యాదగిరి గాడు కూడా అలా తల తిక్కగా మాట్లాడుతున్నాడేంటి? వాణ్ణయిన కాస్త కంట్రోల్ లో పెట్టచ్చుకదా.

గుర్నాధం : బాగానే చెప్పావ్. మీ అమ్మను తమ్ముడ్నయినా కంట్రోల్ లో పెట్టచ్చోమో గాని ఈ కాలం పని మనుషలను కంట్రోల్ లో పెట్టలేం. ఇండియా బాగ డెవలప్ అయిపొతోంది గా. వాడెళ్ళి పోతే వేరే వాళ్ళు దొరకడం చాలా కష్టం. వాడి సంగతి సరే నువ్వేంది స్టాక్ మార్కెట్ లో డ్బ్బులు తగలెశావంట.

పె.కొ : అబ్బే అలాణ్తి దేమీ లేదు నాన్నా? అసలు నేను ఇంత వరకు సంపాదించిన దాంతో ఇండియా లో ఎక్కడన్న ప్లాట్ కొందామనుకుంటున్నా.

గునాధం : ఏంటి ఇక్కడ సిటి లోనే? అయితే బాగానే సంపాదించావన్న మాట. ఎంతుంది ఒక రెండు కోట్లన్నా వుందా?

పె.కొ. : అమ్మో రెండు కోట్లే? నాజీతం తో రెండు కోట్లు సంపాదించాలంటే ఇక్కడ ఒక యాభై ఏళ్ళయినా చాకిరి చెయ్యాలిసిందే.

గుర్నాధం : ఏంది అయిదెండ్లయినా రెండు కోట్లు కూడ బెట్టలేదా? ఒగ నిముషముండు (ఫోన్ మౌత్ పీస్ కు చెయ్యి అడ్డం పెట్టి) ఒరేయ్. యాదగిరి ఇలా రా. నువ్వో సారి వీడికి చెప్పు నీ ఆస్తెంతో.(ఫోన్ తీసుకుని).ఈ యాద్గిరి గాడి తో ఓ సారి మాట్లాడి సిగ్గు తెచ్చుకో.

యాదగిరి : అలో సాబ్ చెప్పండ్రి.

పె.కొ : ఏంటి నువ్వేదో తెగ సంపాదించేశావంట. (వెటకారంగా..) ఎంత సంపాదించేవేంటి.

యాదగిరి : ఏంది సాబ్.నేను సంపాదిస్తున్నానంటే ( low voice action తో) కామెడీగుందా. (పెద్ద గొంతుతో) నఖరాలు చెయ్యకుండా వినుకోండ్రి.పటాన్ చెరువు దగ్గర నా మామిచ్చిన ఆదా ఎకరా ఇప్పుడు దో కరోడ్ పలుకు తోంది. గచ్చిబౌలి కాడ నా అయ్యిచ్చిన ఒకటిన్న ఎకరా ఇప్పుడు తీన్ కరోడ్. సముజయ్యిందా. పెద్ద పీకేస్తానంటూ సూటేసుకొని ఇమాన మెక్కితే సరిపోదు. కాస్త ఇజ్జత్ వుంటే ఇక్కడే వుండి సంపాయించాలే.

పె.కొ : నీతో నేను పోటీపడలేను కాని. కాస్త నాన్నకు ఫోన్ ఇస్తావా?

యదగిరి :ఇగో తీసుకొండ్రి.

గుర్నాధం : అర్థ మయిందా ఇక్కడే వీడి ఆస్తి ఎంతుందఓ. నువ్వక్కడ సేల్ లో వచ్చిన పొస్టాఫీస్ డబ్బుల్తో, కోఆపరేటివ్ సొసైటీ లో రేషన్ కొని ఏం సంపాదిస్తావ్?

పె.కొ : అబ్బా నాన్నా అవి పొస్టాఫీస్ డబ్బులు కావు mail-in rebates సేల్ లో ఏదన్న తక్కువకు వచ్చినప్పుడు కొంటే మిగిలిన డబ్బులు పొస్ట్ లో check పంపిస్తారు. ఇంకోటి కోఆపరేటివ్ సొసైటీ కాదు.costco అని తక్కువ ధర కు వస్తువులమ్మే స్టోర్స్.

గుర్నాధం :ఆ ఏదో ఒక తద్దినం. అద్సరే ఎంత మిగల బెట్టా వేంది?

పె.కొ : ఆ ఓ ఇరవై లక్షలదాక.

గుర్నాధం :(వెటకారంగా) అమ్మో అంతే? ఏమేం కొందామనుకుంటునావ్ దాంతోటి?

పె.కొ : చెప్పాగా ఓ Fలాట్ కొందామనుకుంటున్నా.

గుర్నాధం : ఏంటి హైదరాబాద్ లోనే? నీ ఇరవే లక్షల్తో ఇక్కడ కార్ పార్కింగ్ జాగ కూడా రాదు కాని. ఇంకో ప్లేస్ చెప్పు.

పె.కొ : అలా అయితే మన సొంతూర్లో కొన్ని పొలాలు కొందాం. ఈ మధ్య ఎక్కడ చూసినా సాగు నీటి ప్రాజెక్టులొచ్చేస్తున్నాయి కదా. నీళ్ళొచ్చిన తరువాత మనం కొన్న పొలాల రేట్లు కూడా పెరుగుతాయి.

గుర్నాధం : మనూరు ఏమన్నా ముఖ్యమంత్రి సొంతూరనుకుంటున్నావట్రా? ఆర్నెళ్ళ లో ప్రాజెక్ట్ కట్టేసి నీళ్ళు ఒదిలేయడానికి. అక్కడ నువ్వు సంపాయించి ఇరగదీసింది చాళ్ళే ఇక్కడ ఇండియా కు వచ్చేయ్. ఇక్కడే అమెరికా కన్నా బాగ ఎక్కువగ డెవలప్ అయిపోతొంది.(అంతలో సైబర్ బాబు భయంకరమైన మ్యూజిక్ సౌండ్ తో enter అవుతాడు).ఒరేయ్ చవటా ఆ చెవిటి మిషన్ తీసి చావ్.

పె.కొ : నాన్నా ఏంటా సౌండు. బావొచ్చాడా. ఓ సారి బావ కు ఫోన్ ఇవ్వు.

గుర్నాధం : ఒరేయ్ ఉష్ట్ర పక్షి ఓసారి లా వచ్చి తగలడు. నీ బావ మాట్లాడతాడట.

సై.బా .: Oh I see. He may need my సహాయం.(ఫొన్ తీసుకుని) హాయ్ బావ్స్ wussup. how are you guys and how is your మంచు mountains.

పె.కొ : మేం బాగానే ఉన్నాం కాని. నువ్వా చచ్చు english మాట్లాడ్డం మానవా? george bush హైదరాబద్ వచ్చి వెళ్ళినప్పట్నుండి నీకు ఆ పిచ్చి బాగా ముదిరింది.

సై.బా : you mean I speak చచ్చు english, NO... I speak గుడ్డు అచ్చమైన english. I chat with so many babes on the net yaar.

(ఆనంద్ enter అవుతాడు).

పె.కొ : ఏడ్చావ్ లే. అవును నాకు స్టాకుల్లో డబ్బు పోయినట్టు నాన్న కెందుకు చెప్పావ్.

సై.బా : No yaar నేను చెప్ప లేదు. నీ మీదొట్టు.(style గా) just email పంపించానంతే.

పె.కొ : తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్టు నీ internet పిచ్చి పరాకాష్టకు చేరింది. తమ్ముడక్క ఉన్నాడా.

సై.బా : yeah ఇప్పుడే login అయ్యాడు. నేను logout అవుతా. అక్కడ ఎగువ పాలెం అందరిని అడిగినట్లు చెప్పు బావ.

పె.కొ : ఇక్కడ ఎగువ పాలెం ఏందిరా భగవంతుడా.

సై.బా : అదే highlands ranch

పె.కొ : నువ్వు logout కాదు కనీ నీ system shutdown చేసుకొని వెళ్ళిపో.

సై.బా : ఒరేయ్ small బావా ఇదిగో big బావ from ఎగువ పాలెం.

ఆనంద్ : హలో అన్నయ్యా. బావున్నావా?

పె.కొ : ఆ బాగానే వున్నా. ఇంతకూ నువ్వు ఏదన్న ఉద్యోగం కోసం ట్రై చేస్తున్నావ లేక ఇంకా కవిత్వా లంటూ కవి సమ్మేళనాలకు వెళుతున్నావా?

ఆనంద్ : (కవిత్వం అందుకుంటాడు)

నాకెందుకొయీ ఉద్యొగం
నాకేమీ లేదు హృ ద్రోగం
ఒస్తే చెయ్యాలి ప్రతి రోజూ ఊడిగం.
అవుతుంది అది దిన దిన గండం
బజార్ల వెంట బటాణీలు తింటూ
బలాదూరుగా తిరిగే నా పేరు లోనే ఉంది నిరు 'ఉద్యొగం".
(ఫొన్ disconnect అయిపోతుంది)
నీకు లేదురా కవితలు వినే అదృష్టం.
అందుకే నీజీవితమొక దురదృష్టం.
నువ్వు చెయ్యాలి రా అమెరికాలో కాయకష్టం.
నువ్విక్కడ లేనందుకు నీకదో పెద్ద నష్టం.
(అని చెప్పి) ఇప్పుడు చప్పట్ట్లు.(తనే చప్పట్లు కొట్టుకుంటాడు).
యాదగిరీ..ఎక్కడికెళ్ళారు వీళ్ళంతా? మన కవితా ప్రవాహం లో కొట్టుకొని పోయుంటారు.
(యాదగిరి తెర చాటు నుండి బయటకు వస్తాడు.)
ఏరా ఎక్కడి కెళ్ళావ్? నా కవిత్వాలకు గాని భయపడ్డావా?

యాదగిరి : లేదు సాబ్. మీరు మాంచ్ షాయిరీలు ఇనిపిస్తార్ సాబ్.

ఆనంద్ : చాల మంచిది నువ్వన్నా నన్ను అర్థం చేసుకున్నావ్. ఆ ఆనందం లో నీమీ దో ఆసు కవిత్వం వింపిస్తా.

యాదగిరి : సాబ్ నాకు ఆసు, జొకర్, కాళావర్ కవిత్వాలు ఒద్దు సాబ్. మధ్యాహ్నానికి అన్నం వండాలి సాబ్. నేను వెల్తున్నాను.

ఆనంద్ : అలాగే వెళ్ళు.(యాదగిరి సంబర పడి పోతాడు) కానీ నా కవిత్వం విన్నా తరువాతే. (యాదగిరి మొఖం వాడి పోతుంది)......(ఆనద్ గొంతు సవరించుకుని)...

యాదగిరి(high pitch) నీమీదే అందరి గురి.
నీ మూతిమీదుందో పులిపిరి.
అదే నీ జీవితానికో సిరి.
పొరపాటున నీకు వేసినా ఉరి
పోదురా నీ ఊపిరి.(యాదగిరి లోపలకు పారిపోతాడు).
గోకేస్తె నీ పులిపిరి
పోతుందిర నీ కొన ఊపిరి.

గుర్నాధం : ఒహో నువ్వొచ్చావా? ఇందాకా ఆ సైబర్ బాబూ..యాదగిరి పారిపోతుంటే ఏమిటో అనుకున్నా... అది నీ ప్రతాపమన్నమాట.

ఆనంద్ :(వుడుక్కొని).ఆ నా ప్రతాపాని కేం కాదు. వాళ్ళకేదో పని వుండి వెళ్ళి పొయారంతే. కావాలంటే మీ మీదో కవిత చెప్పమంటారా?

గుర్నాధం : నా చెవులకు అంత శక్తి లేదు కానీ. నువ్వు పోద్దున్నే వెళ్ళి అంత తొందరగా వచ్చేశావేంటి.

ఆనంద్ : నాకు ఒక లక్ష రూపాయలు కావాలి.

గుర్నాధం : ఒక లక్షే. ఎక్కడ్నుంచి వస్తుంది. మొన్న ఆ గబ్బిలాల సుబ్బా రావ్ వాళ్ళ అమ్మాయి సంబంధాన్ని ఒప్పుకునుంటే ఓ కోటి రూపాయల దాక కట్న మొచ్చేది గా.

ఆనంద్ : ఆ అమ్మాయి ఇంటి పెరుకు తగ్గట్టు గబ్బిలం లాగే వుంది. ఆ అమ్మాయిని చేసుకుంటే నా పేరు గబ్బిలం మొగుడు అయ్యేది.

గునాధం : ఆ అమ్మాయి సరే. real estate business ఉన్న కప్పగంతుల కపిలేశ్వర రావ్ కూతురుకేమయింది. ఒకటే కూతురు అప్పనంగా ఓ పది కోట్ల ఆస్తి వచ్చేది.

ఆనంద్ : కప్పగంతుల కపిలేశ్వర రావ్, గండు చీమల గుండూ రావ్, ఆంబోతుల ఆనంద రావ్... వీళ్ళ కూతుళ్ళకు మనిషి లక్షణాలు వుండక పోతే పాయె...కనీసం జంతు లక్షణాలయినా సరిగా వుండాయా? ఇలాంటి వాళ్ళను ఎవడైనా చేసుకుంటాడా?

గుర్నాధం : మనిషెలా వుంటే ఏంది. వాళ్ళ వెనకాల కోట్ల కొద్ది డబ్బుంది కదా.

ఆనంద్ : మనకూ వుంది అంత డబ్బు. అయినా అవన్నీ నాకెందుకు ఇప్పుడు. నాకు లక్ష రూపాయలివ్వండిప్పుడు.

గుర్నాధం : నేను చస్తే ఇవ్వను.

ఆనంద్ : ఇవ్వరా?

గుర్నాధం (తాపీగా): ఇవ్వను గాక ఇవ్వను. నువ్వెన్ని కవిత్వాలు చెప్పిన చెవి లో దూది పెట్టుకుని వింటాను కాని నీకు మాత్రం డబ్బు ఇవ్వాను.
ఆనంద్ : మిస్టర్ గుడ్డు గుర్నాధం! ఇవ్వక పోతే ఎలా తీసుకోవాలో నాక్కూడా తెలుసు. (అనేసి లోపలి కెళ్ళి పోతాడు).

(సై.బా. వస్తాడు.)

సై.బా. : hey మాంస్ what happened why small బావ is very కోపం. did you say his కవిత్వం bad?

(యాదగిరి కూడా వస్తాడు)

గుర్నాధం : వాడి కవితలకు అభిప్రాయాలు కూడ చెప్పాలా. వాడిది కవిత్వం కాది కపిత్వం.

(ఆనంద్ వుసురుగా లోపల్నుండి వస్తాడు.)

ఆనంద్ : ఏంటి నాది కపిత్వమా? మీకిప్పిడే గుణపాఠం చెప్తా.

గుర్నాధం : పోరా బోడి నువ్వు చెప్పెడి ఎంది. నా అనుభవమంత లేదు నీ వయసు. నువ్వు నాకు చెప్పెదేంది.

ఆనంద్ : చెప్తా...చెప్తా (అని కోపంగా లోపలికి వెళ్ళిపోతాడు.)

సై.బా : why మాంస్ మీకెందుకంత కోపం? computer లో virus పెద్ద వాళ్ళలో కోపం వుంటే చాలా danger. virus computer ను తినేస్తుంది.కోపం మనసుని తినేస్తుంది.

యాదగిరి : అవును సాబ్. అబ్బాయ్ చెప్పింది కరక్ట్. జర ఇనుకోండ్రి.

గుర్నాధం : ఏరా మీరందరూ నాకు నీతులు చెప్పే వాళ్ళయిపోయారా? వెళ్ళి మీ పనులు చూసుకోండి.
(గుర్నాధం లోపలికెళ్ళి పోతాడు.)

(సై.బా. Lap top లో చాటింగ్ చేస్తుంటాడు. యాదగిరి తొంగి..తొంగి చూస్తాడు).

సై.బా : hey whaat man? what do you want? Do you want to chat with this babe from africa? she is so kewl you know.

యాదగిరి : ఛా. పోరిల తో నాకేం పని ఇప్పుడు. ఆ ఏం లేద్. దస్ అయ్యింది కదా. షేర్ మార్కెట్ ధర్వాజ తెరిచుంటారు. జర నా షేర్ price ఎంతుందో చెప్తావని.

సై.బా : ( తల పైకెత్తి) yeah India has really really Developed now నీ స్టాక్ పేర్లు చెప్పు.

యాదగిరి : ఇన్ పోసిస్.

సై.బా : ఏంటి

యాదగిరి :ఇన్ పోసిస్.

సై.బా .: Oh you mean Infosys?

యాదగిరి : యెస్.

సై.బా : ఏడువందల ఇరవై..maan....Next

యాదగిరి : వుల్టాస్.

సై.బా. : వుల్టాస్...you mean వుల్టా పళ్టా.

యాదగిరి : గీ నీ యవ్వ. పొద్దున లేచిన కాడ్నించి పండుకునే దాక ఊకే గీ కంపుటర్ మీద కూకుంటావ్. అద్గూడ తెల్వదా నీకు. వుల్టాస్ అంటే అదే వయ్యా. గీ ఫ్రిజ్ లూ..ఆసీ మెషీన్లు చేస్తారు గదా.

సై.బా. : ఓహ్ VolTas.....వెయ్యీ ఇరవై. ఎంతగొన్నావేంటి.

యాదగిరి : నాల్నెల్ల క్రితం. దో సౌ కు కొన్నా.

సై.బా. : బాగనే పెరిగింది.

యాదగిరి : గేంది గిట్లా తల తిరుగుతోంది?

సై.బా. (కూల్ గా laptop close చేసి): తిరుగుతోంది నీ తల గాదు. నీ టవ్వల్లో చుట్టిన cell phone. తలకున్న ఆ టవ్వల్ తీసిఫొన్ ఎత్తు. (సై.బా. బయటికి వెళ్ళిపోతాడు.)

(యాదగిరి తల కున్న రుమాలు తీసి, ఫొన్ లో మాట్లాడతాడు.
యాదగిరి :అలో.. సుబ్బి నువ్వా గెందే మల్లీ ఫొన్ చేసినవ్....ఏంది..నిన్న దోస్త్ కాడికి పోయిన మన కూతురు ఈరోజు కూడ ఇంటికి రాదా. గట్లయితే సిన్మా చూసిన తరువాత బ్లూ పాక్స్ లో బిర్యాని తినేసి ఇంటికి పోదాం. సరె నువ్వక్కడ ఫొన్ నొక్కేయ్. నేనిక్కడ ఫొన్ నొక్కేస్తా.

Scene 2

(గుర్నాధం హాల్లో paper చదువుకుంటూ ఉంటాడు....యాదగిరి పరిగెత్తుకుంటూ వచ్చి)

యాదగిరి : సాబ్...కొంప మునిగింది మనింట్లో బీరువాలో వున్న నగలు డబ్బులు అన్నీ ఎవరో ఎత్తుకుపోయారు.

గుర్నాధం : సరీగా చూశావట్రా? నిన్నే అక్కడ farm house లో దాచిన యాభై లక్షలు తీసుకొచ్చి బీరువా లో పెట్టా.

యాదగిరి : బాగనే చూసా సాబ్. మొత్తం ఖాళీ.బిల్కుల్ ఏమీ లేదు.

గుర్నాధం : వెంఠనే పోలీసులకు ఫొన్ చెయ్యరా.

(యాదగిరి ఫొన్ దగ్గరకు వెళ్ళే లోపు ఫొన్ రింగవుతుంది. యాదగిరి ఫొన్ తీసుకుని మాట్లాడతాడు)

యాదగిరి : అలో..ఏంది..ఆనంద్ బాబు ఎవరో అమ్మాయి తో కలిసి ఏర్పోర్ట్ లో కనిపించాడా? సింగపూర్ ఇమానమెక్కాడా?(ఫొన్ పెట్టేసి). కొంపలంటుకున్నాయ్. మనబ్బాయ్ గారే ఇంట్లో డబ్బులు దొంగలించేసి ఎవత్తినో లేవతీసుకుని పొయిండు.

గుర్నాధం : వాడి మీద ఎన్నో ఆశలు పెట్టుకుని కోట్ల కొద్దీ కట్నం తీసుకోవచ్చను కున్నా. నన్ను ముంచేసి ఎవత్తో పనికిమాలినదాని లేవదీసుకు పోయాడురో దేవుడో.

(యాదగిరి ఫొన్ రింగవుతుంది).

యాదగిరి : అలో. ఏందే నువ్వు మాట్లాడేది. మనమ్మాయి గా చింపాంజీ ఆనంద్ గాడి తో లేచిపోయిందా? ఓర్నాయనో దీనికేం పోయెకాలమొచ్చిందిరో? (కోపంగా గుర్నాధం దగ్గర కెళ్ళీ). నీ యెవ్వ.. నీ పనికిని రాని కొడుకు నా బిడ్డకు మాయ మాటలు చెప్పి లేవదీస్కపోయిండు. వాడు రానీ వాన్ని మట్టన్ ముక్కలు నరికినట్టు నరికి ఖైమా చేసి పారేస్తా. ఈ యాద్గిరంటే ఎందో సూపిత్త. ఓరేయ్ గుడ్డు గుర్నాధం...మీ వంశమే అంత రా.

(గుర్నాధం..యాదగిర్..ఒకరి వెంట ఒకరు పరిగెత్తుతారు..)

గుర్నాధం : అంట్ల వెధవా. నా ఇంట్లో పనిచేస్తూ. తెలివి గా నీ కూతురు వల్లో మా వాడ్ని పడేసుకుని మళ్ళీ నన్నంటావా? ముష్టి వెధవ్వి నీతో నాకు మాటలేంటి.చిరంజీవి లెక్కనుండే నా కొడుకు ని పట్టుకుని చింపాంజి అంటావా? కుళ్ళిపోయిన కోడి గుడ్డు లా ఉండేది నీ కూతురే రా.

యాదగిరి : ఒరేయ్. పుడ్డూ కూడా సరీగా తినకుండా బతికే గుడ్డు గుర్నాధం గా నువ్వు నా కూతుర్నంటావా. నిన్ను ఈ రోజు ఏసేస్తా. ఆగు.

(సై.బా. enter అవుతాడు.)

సై.బా : hey maams...hey yaads ..cool down..yaar..its all overమీరు మీ windowsని minimize చేసుకుని నేను చెప్పేది వినండి. small బావ ఎవర్ని లేపుకు పోలేదు. యాదగిరి కూతురూ....small బావ ఎప్పట్నుంచో login, password లాగ లవ్వాడు కుంటున్నారు. you old guys marriage కు ఒప్పుకోరని నిద్ర మాత్రలు మింగి windows operating systems close చేసుకుని cyberspace లో కలిసిపోదామనుకున్నారు. cyberspace లో ఉండాల్సింది గూగుల్ యాహూ లాంటి web సైట్లు కానీ మీ లాంటి మంచి మనసున్న operating systems కాదని చెప్పి.నేనే వెళ్ళి మన ఊరి అంజనేయ స్వామి గుళ్ళో ఆ రెండు operating systems నీ marriage అనే desktop మీద install చేసి, వాళ్ళను సింగపూర్ విమానమెక్కించి వచ్చా. ఇప్పుడు మీరిద్దరూ...మనమామలు...అంటే వియ్యంకుల్స్...we uncles అన్నమాట.సో మనమామలూ Don't worry వాళ్ళకు ఓ బుజ్జి laptop పుట్టగానే ఇక్కడకు వచ్చేస్తారు.

గుర్నాధం : ఓరి దుర్మార్గపు వెధవ ఇది నీ పనా...ఉండు నీసంగతి చెబుతా. (అంటూ కొట్టడాని లేస్తాడు)

యాదగిరి : బద్మాష్...సువ్వర్ కేబచ్చే..నిన్నేసేస్తా. (అని సె.బా. వెంట పడతాడు.)

(Close curtains)