Thursday, October 26, 2006

అనుకోకుండా ఒక టీ.వీ. సమర్పించు శతృవులతో ముఖా ముఖి.


Moderator accent should be like shanti swaroop(doordarsan news reader)

Moderator: "అనుకోకుండా ఒక టీ.వీ." ప్రేక్షకులకు నమస్కారం. మేము అనుకోకుండా మొదలు పెట్టిన
ఈ టీ.వీ. ఛానల్ మేమేమీ అనుకోకుండా పాపులర్ అయింది. ఈ ఛానల్ అనుకోకుండా తెర మరుగవ్వకుండా
వుండాలనే ఉద్దేశ్యం తో మా టీ.వీ. ప్రొడ్యూసర్ చిలుమే అబీబా జలాండ్రవాజు తన బుర్రలోని బూజు దులిపి తయారు చేసిన సరి కొత్త వినూత్నమైనకార్యక్రమం.చిలుమే అబీబా జలాండ్రవాజు అనగానే ఇదేదో ఆఫ్రికన్ పేరు లాగ అనిపించొచ్చు. నిజమే జలాండ్రవాజు గారు ఆఫ్రికాలో
పుట్టినా మన తెలుగు వారే. వాళ్ళ పూర్వీకులయిన విజయ నగర రాజులు అలుపెరగ కుండా రాజ్యాలను జయించుకుంటూ సరిహద్దులు దాటి ఆఫ్రికా చేరుకుని తిరిగి వచ్చే దారి తెలియక అక్కడే స్థిరపడి పోయారు.ఇప్పుడు వాళ్ళూరికి విమాన సౌకర్యం రావడం వల్ల మన ఆంధ్ర దేశం మీద
అభిమానంతో అక్కడికొచ్చిన మొదటి విమానంలోనే తనకు టికెట్ దొరక్క పోయినా లంచమిచ్చి మన తెలుగు పైలట్ అయిన వాయులింగేశ్వర రావ్ వళ్ళో కూచుని ఇక్కడ హైదరాబాదులో వాలారు.

ఇక మీరే చూడండి "శత్రువులతో ముఖాముఖి"

నమస్కారం కాలనీ ప్రెసిడెంట్ గారు, నమస్కారం దొంగల ముఠా నాయకుడు గారూ. మీరు మీ దొంగల సమస్యను, దోచుకునే సమస్యను సామరస్య పూర్వకంగా పరిష్కరించు కోవాలనుకుంటున్నందుకు చాలా ధన్యవాదాలు. మీ ప్రయత్నాన్ని ముఖ్యమంత్రి గారు కూడా
హర్షిస్తున్నారు. బహుశా ప్రపంచ చరిత్ర లోనే ఇలా దొంగల ముఠానాయకుడికి ఒక కాలనీ ప్రెసిడెంట్ కు మధ్య చర్చలు జరపడానికి మధ్యవర్తిత్వం వహిస్తున్నందుకు నా జన్మ ధన్యమైంది. ఇక మీరు మీ సెల్ ఫోన్ లను ఆF చేసేసి చర్చలకు సిద్ధం కావలసింది గా మనవి
చేసుకుంటున్న్నాను. సౌలభ్యం కోసం మిమ్మల్ని(దొంగ వైపు తిరిగి) దొం.నా. అని (కాలనీ ప్రెసిడంటు వైపు తిరిగి) మిమ్మల్ని కా.ప్రె. అని పిలుస్తాను.

కాలని ప్రెసిడెంట్: నమస్కారం దొంగల నాయకుడు గారూ.

దొంగల నాయకుడు(పాన్ నములుతూ..మీసాలు మెలేస్తూ): నమస్తే నమస్తే. ఇప్పటికైనా తెలిసిందా మా దొంగల దెబ్బేమిటో?

కా.ప్రె.(moderator వైపు తిరిగి): చూడండి జంబులింగం గారు. ఇతను ఎలా మాట్లాడుతున్నాడో. ఏదో కాంప్రమైజ్ కొచ్చాం కదా అని ఒస్తే ఇలా మాట్లాడం ఎమీ బాగలేదు. ఇతను దొంగల నాయకుడు కాక ముందు మా కాలనీ వాళ్ళు ఇతని మక్కలిరగ దీశారనే విషయాన్ని
ఇంకా మనసులో ఉంచుకొని మాట్లాడుతున్నాడు. ఇలా అయితే నేను బాయ్ కాట్ చేస్తా.

moderator: మీరు ఆవేశపడ కండి ప్రెసిడెంటు గారూ. నేను మాట్లాడతాను కదా. మీరు కూర్చోండి. దొంగల నాయకుడు గారూ. మీరు దొంగల ముఠా నాయకుడు కాక ముందు ఈ కాలనీ వాళ్ళు మీ మక్కెలిరగదీశారనే విషయాన్ని మనసులో వుంచుకుని
మాట్లాడ కూడదని మనవి చేసుకుంటున్నాను. మీరు దొంగల నాయకుడవుతారని తెలియక వాళ్ళప్పుడు చేసిన తప్పు. అటువంటివి మనసులో ఉంచుకోవద్దని మనవి చేస్తున్నాను.

దొం.నా: అలాగలాగే ఈపారికి ఒదిలేత్తా.

moderator: మీరు మా విన్నపాన్ని మన్నించి నందుకు చాలా థాంక్స్. కా.ప్రె. గారు చర్చలు
ప్రారంభించడానికి ముందు మీ కాలనీ వాళ్ళ బాధలేమిటో వినిపిస్తారా?

కా.ప్రె: ఓ. తప్పకుండా. క్రితం సంవత్సరం వరకు మేము హాయిగా. కిష్కింధ టీ.వీ లో
వచ్చే డబ్బింగ్ సీరియల్సూ,గజిబిజి టీ.వీ లో ప్రొడ్యూసర్లు కూడా మరిచిపోయిన డబ్బింగ్
సినిమాలు రోజుకు నాలుగు సార్లు వేసినా కూడా చూస్తూ, శాంతం-ప్రశాంతం టీ.వీ.
లో వచ్చే అలీ బాబా ఇరవై మర్డర్లు ఇరవై రేపులు లాంటి క్రైం ప్రొగ్రాంస్ ఎంజాయ్ చేస్తూ
లైఫ్ హ్యప్పీ గా గడిపేవాళ్ళం. అలా సాగి పోతున్న మా ఆనంద నగర్ కాలనీ లోకి ఈ
పక్క రాస్ట్రం దొంగలు ప్రవేసించి మా ఆనంద నగర్ కాలనీని విషాద నగర్ కాలనీ
చేసేశారు ఈ దొంగ వెధవలు.

దొం.నా.: ఏయ్ ఏంది భే. మమ్మల్ని ఎదవలంటున్నావ్?. మీరే ఎదవలు కాబట్టే మేమా...
వూర్నుంచి ఈ వూరొచ్చి హాయిగా బతుకుతున్నాం.

moderator: అయ్యా.దొం.నా. గారు. మీరు కొంచెం శాంతించాలి. ఇది లైవ్ ప్రొగ్రాం. మీరు
ఏమిచేసినా మా ప్రేక్షకులకు కనపడుతుంది.

దొం.నా. అయితే కాని నాకేం. రేపో మాపో అసెంబ్లీ కెళ్ళాల్సినోడిని. ఇది మంచి పబ్లిసిటి.

moderator: మీరు కాస్త దయచేసి కూర్చోండి. మీరు చెప్పండి కా.ప్రె. గారూ.

కా.ప్రె: అలాగే. ఈ దొంగ గారు మళ్ళీ ఇలా మాట్లాడితే ఊరుకునేది లేదు.

దొం.నా: ఏం చేస్తావ్ భే? (లేచి మీద కొస్తాడు.....moderator పట్టుకుని మళ్ళీ
కుర్చీ లో కూచోపెడతాడు.)

moderator: కా.ప్రె.గారూ క్షమించండి.మీరు ఆవేశపడకుండా మాట్లాడండి.

కా.ప్రె.(కోపంతో): ఇక నేను మాట్లడేది ఏమీ లేదు. నా గురించి అంతా చెప్పేశాను.

moderator:దొం.నా. గారూ! ఇక మీ గురించి కాస్త మా ప్రేక్షకులకు చెబుతారా?

దొం.నా: ఆ... టీ.వీ వూయర్లందరికి నమస్తే. ఇక్కడున్న అందరికి కూడా నమస్తే..
.(కా.ప్రె. ని చూపిస్తూ)..ఈడికి తప్ప.

కా.ప్రె: నీ బొడి నమస్తే ఎవడికి కావాలి. నువ్విచ్చినా నేను వెనక్కిచ్చేస్తా.

దొం.నా: ఏయ్ నాయాలా నువ్వు బయటికి రా నీ సంగతి సెప్తా. (ప్రేక్షకుల వైపు తిరిగి)
మీ అందరికి మరొక్కసారి దండాల్.నేను ఈ రాష్ట్రం ఎందుకొచ్చినానో తెలుసా.
మీరు చానా మంచోళ్ళు. ఎవడొచ్చి ఏం చేసినా ఏం అనరు. రోజు మీబొక్కలిరగ
దీసి డబ్బుల్ దొంగతనం చేస్తే ఏం మాట్లాడర్. మల్లా సంపాయించుకుని మాకు
డబ్బులు రడీ చేస్తార్. ఈ పోలీసొళ్ళు కూడా చానా మంచోళ్ళు. పక్క రాష్ట్రం
దొంగంటే ఇంకా బాగా చూసుకుంటారు. అప్పుడప్పుడూ కొంచెం కమీషన్ ఇస్తే చాలు
వాళ్ళు ఆ బార్డర్ కు కూడా రారు. అందుకే గా బీహార్ నుండి ఇక్కడికొచ్చి సెటిలయినా.
మా బీహార్ లో అయితే ఇంటికొ గన్నుంటాది. అక్కడ జేబులో పెన్ను కన్నా చంకలో
గన్నులెక్కువగా ఉంటాయ్.

moderator: చాలా మంచిది. దొం.నా. గారూ? ఇక మీ డిమాండ్లేమిటో తెలుసుకుందాం.

దొం.నా.: ఓరి నీ యవ్వా నేను చెప్పేది అప్పుడే అయిపోలా. ఇంకా ఉంది కొంచెం ఆగు.
నువ్వా చొక్కా కు గుండీ పెట్టుకో. ఏంది మాతో సమానమనుకుంటావా?
(ప్రేక్షకుల వైపు తిరిగి) అయినా నాకు తెలీకడుగుతా. దొంగతనం చేస్తే తప్పేముంది?
అది మా వృత్తి. రాజకీయ నాయకులు పెద్ద పెద్ద వాటికి కమీషన్ లు తీసుకొని మిమ్మల్ని
దోచుకుంటార్. వాళ్ళు కనిపిస్తే వాళ్ళకు సలాములు కొడతార్. గూండా గాళ్ళు రోడ్డు
మీదే డబ్బులు గుంజుకుని పోతే అడిగే వాళ్ళుండరు. గాళ్ళు రోడ్డు మీదే మర్డర్లు
చేసినా...రేప్ లు చేసినా అడిగే వాళ్ళుండర్. ఏ..పెసిడెంటూ ఎప్పుడన్నా దొంగ
తనానికొచ్చినప్పుడు మీ ఆడోళ్ళ మీద చెయ్యేసినామా చెప్పు? (కా.ప్రె. లేదని తలూపతాడు)
...అద్గదీ మా నిజాయితీ. మీరు మీ జీతాల కోసం ఉద్యోగం చేస్తారు..మేము
మా జీతాల కోసం దొంగతనం చేస్తాం.

కా.ప్రె: ఏంటి? మీ జీతాలు మా దగ్గరుంటాయా? మా నాయనే మా బాగ సెలవిచ్చావ్.
నువ్వు రాజ కీయాల్లోకి వస్తే బాగ సరిపోతావ్. మీ పార్టీ కి గుర్తుగా కత్తీ
బ్లేడు పెట్టుకోవచ్చు.

దొం.నా: ఏం మేమంత చీప్ గా కనిపిస్తున్నామా? అల్రేడీ మా పార్టి కీ గుర్తు
గా మీరు జీతాలు తీసుకొనేటప్పుడు సంతకం చేస్తారే గా...రెవెన్యూ స్టాంప్
గుర్తు గా కావాలని అప్లికేషన్ పెట్టేసినాం.

కా.ప్రె.: ఏంటి ...రెవెన్యూ స్టాంప్ మీ పార్టీ గుర్తా? చాలా గొప్ప సందేశం తో
పార్టీ పెడుతున్నావ్?

moderator: దొం.నా. గారు మీకు చాలా తెలివితేటలు ఉన్నట్టున్నాయి. మీరు ఈ ప్రోగ్రాం
అయి పోయిన తరువాత ఒక సారి మా ప్రొడ్యూసర్ చిలుమే అబీబా జలాండ్రువాజు ను కలవమని మెసేజ్ పెట్టారు....

దొం.నా: (మీసాలు మెలేస్తూ): అలాగలాగే.

moderator: ఇక చర్చ ప్రారంభిద్దామా?. మొదటగా దొం.నా గారి మాట్లాడతారు.

దొం.నా.: ఆ నేరుగా పాయింట్లో కొచ్చేస్తా. మేము గీ కాలనీ లో దొంగ తనం
చెయ్యకుండా ఉండాలంటే. వాళ్ళే వారానికోసారి మా డెన్ కు వచ్చి రెండు లచ్చల
రూపాయల సున్నా నయా పైసలు డబ్బులియ్యాల.

కా.ప్రె.: దాంట్లో మళ్ళీ నయపైసలైంది గురువా?

దొం.నా: ఏమో నాకు తెల్వదు. మా లాయర్ గట్లనే చెప్పమన్నాడు. ఏదైనా కరక్టుగా
ఉండాలన్నాడు.

కా.ప్రె.: అమ్మో రెండు లక్షలే? మా వల్ల కాదు. మా కాలనీలొ ఉన్నదే 150 ఇళ్ళు. ఈ
లెక్కన నెలకు 600 రూపాయలు మటాష్.

దొం.నా(కోపంగా..): అలాగయితే మీ 150 ఇళ్ళళ్ళో ఉన్న 150 మంది మగాళ్ళు మటాష్.

moderator: కా.ప్రె. గారూ చర్చల కొచ్చినప్పుడు వాళ్ళని రెచ్చ గొట్ట కుండా
మాట్లాడాలి.

కా.ప్రె: నీ బొంద. నీ జీతం డబ్బులిస్తే తెలుస్తుంది. కొంపదీసి నీక్కూడా కమిషన్
వస్తుందా జంబులింగం?

moderator: అలాంటిది ఏమీ లేదు. దొం.నా. గారూ. మీ డిమాండ్లేమిటో మీరు చెప్పండి.

దొం.నా: వారానికి రెండు లచ్చల తో పాటు మా ముఠా లోని అందర్ని నెలకోసారి ఫారిన్
ట్రిప్ తీసుకుపోవాలి.

కా.ప్రె: వార్నాయనో. నేను నా ఫ్యామిలీ తో తిరుపతి కెళ్ళి మొక్కు తీర్చుకుని గుండు
కొట్టిద్దామంటేనే డబ్బుల్లేవ్.

moderator: కా.ప్రె. గారు. మీరు వారి డిమాండ్లకు ఒప్పుకుంటే మీ జీవితమంతా
మీకు గుండే గా. దేవుడికి పెద్ద మొక్కు తీర్చుకున్నట్టు ఉంటుంది.

దొం.నా; అంతే కాదు. మా ముఠా లో ఎవరికి పిల్లలు పుట్టినా మీ కాలని వాళ్ళందరూ
వచ్చి మాకు గిప్టులు ఇయ్యాలి.

కా.ప్రె: ఒహో...దానికేం బాగ్యం. మీ ముఠా లో ఎంత మంది మొగ వాళ్ళున్నారు?

దొం.నా: ఆ ఎంత మంది? ఇరవై ఎన్మిది మంది అంతే. కాక పోతే ఒక్కోడికి
తక్కువలో తక్కువగా ఓ ఆరుగురు పెండ్లాలుంటారు.

కా.ప్రె: ఈ డిమాండ్లకు నేను ఒప్పుకోను.

moderator: కా.ప్రె. గారు. చర్చలన్న తరువాత కొంచెం ఇచ్చి పుచ్చుకోవాలి.

కా.ప్రె: ఒరేయ్ జంబులింగం. ఏదో చిన్నప్పటి క్లాస్స్ మేట్ వి కదా అని నిన్ను
మద్యవర్తి గా పెట్టుకుంటే నాకే క్షవరం చేయిస్తావ్ రా.

దొం.నా: ఏయ్ ఎందా మాటలు. నా డిమాండ్లింకా అయిపోలా.

కా.ప్రె: ఏంటి ఇంకా ఉన్నాయా? ఆ మిగిలిన డిమాండ్లు తీర్చడానికి ఎవరుంటారు?

దొం.నా: మీరే. సెబుతా ఇనుకో. మేం పార్టి పెడితే మీ కాలనీ లో ఉన్న
ఓట్లన్నిఎ నాకే ఎయ్యాల. అంతే కాదు ప్రచారానికి మీ కాలనీ ఓళ్ళందరూ
ఆఫీసు కు లీవు పెట్టి నాతో తిరగాల.

కా.ప్రె: అయిపోయాయా? ఇంక ఏమన్నా మిగిలాయా?

దొం.నా: ఒక్కటి మాత్రం చివరికి మిగిలిపోయింది.

కా.ప్రె(వేదాంత ధోరణి లో): ఆ ఒక్కటి మాత్రం ఏం తప్పు చేసింది నాయనా. కానీ.
దొం.నా: అబ్బో చెప్పాలంటే నాకే సిగ్గేస్తొంది బాబు..(సిగ్గు పడతాడు)

కా.ప్రె: సిగ్గెందుకు బాబూ. చెప్పు. రాజకీయాళ్ళోకి వెళ్ళే వాళ్ళకు
ఉండకూడనిది అది. సిగ్గొదిలి చెప్పు.

moderator: దొం.నా గారు మీకు అంత సిగ్గయితే నా చెవిలో చెప్పండి.
(దొం.నా. moderator చెవిలో ఏదో చెప్పి మెలికలు తిరిగిపోతాడు.)
(moderator నవ్వుతూ..) ఆ ఏం లేదు కా.ప్రె. గారు ఇది మీ జీతానికి, డబ్బులకు
సంబంధించింది కాదు. ఈ దొం.నా గారికి. ఇంకా పెళ్ళి కాలేదట.

కా.ప్రె: ఓహోఎ ఓ మాంచి సంబంధం చూసి పెళ్ళి చేయాలా?

moderator: అదేం లేదు తనే అమ్మాయిని చూసుకున్నాడట.

కా.ప్రె: అయితే ఇంకేం. మా కాలని వాళ్ళందరూ ఒక పెద్దా మంగళ సూత్రం
చేయించాలంతే కదా?

moderator: అటువంటి దేమీ లేదు. మీ కాలనీ లో మీ ఇంటికి దొంగ తనానికి
వచ్చినప్పుడు మీ అమ్మాయిని చూసి మనసు పడ్డాడట. ఇప్పుడు మీ అమ్మాయిని
అతని కివ్వాలంటున్నాడు.
(ధబ్ మని శబ్దం వస్తుంది...కా.ప్రె. కింద పడిపోతాడు. moderator టీ.వీ.
వైపు చూసి )
ఈ కార్యక్రమం లో పాల్గొన్నా దొం.నా గారికి. కా.ప్రె. గారికి మా అనుకోకుండా
ఒక టీ.వీ. తరపున ధన్యవాదాలు. చిలుమే అబీబా జలాండ్రువాజు తరపున
కూడా మీకు లెక్కెర్ ఓం జౌ టీ ఆంట్ మోట్. డంకీ. మళ్ళీ ఇలాంటి ఒక
కార్యక్రమం తో మీ ముందుకు వస్తాం. అంత వరకు సెలవ్.